టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని తప్పు పడుతూ పలు విమర్శలు చేశారు.
ఈసారి రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వలన తగినంత వర్షాలు పడవని, తాగుసాగు నీటికి కరువు ఏర్పడుతుందని పది నెలలు ముందు నుంచే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ విషయం ఇంత ముందుగా ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పటికీ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. అందువల్లే నేడు ప్రజలు విద్యుత్ కొరత, నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. కనుక సిఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతోనే నేడు రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రయోజనాలపై దూరదృష్టితో వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి.. అది విస్మరించి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ మూడేళ్ళు కాలక్షేపం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ, గోవాల్లో ప్రజాస్వామ్యంపై ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది.
ఇప్పుడు కరువు ముంచుకు వచ్చిన తర్వాత ఇప్పుడు రైతులను పంటలు వేయకుండా త్యాగాలు చేయాలంటున్నారు. కానీ మీరేమి త్యాగాలు చేశారు? రైతుల సంస్థల్లో కూడా మీ మనుషులను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పడక మునుపు ఆంధ్రా పాలకుల కారణంగా మనకు నీళ్లు దక్కలేదని అనుకున్నాం. కానీ తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ళ తర్వాత కూడా ఎందుకీ దుస్థితి? ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క రిజర్వాయర్ నిర్మించలేదు. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకి మరమత్తులు చేయించలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత రాష్ట్రంలో మహిళలు బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తోందంటే అది ఎవరి నిర్లక్ష్యం వలన?
ఇప్పటికైనా సిఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మిషన్ భగీరథను పూర్తి చేసి ప్రతీ ఇంటికీ నల్లా నీళ్లు అందించాలి,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
దూప అయినప్పుడే బావి తవ్వుకుంట అన్నట్టు ఉంది ముఖ్యమంత్రి వ్యవహారం కరువు తీవ్రత గురించి పది నెలల ముందే తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే రాష్ట్రం ఈరోజు విద్యుత్ కొరత, నీటి కొరతతో సతమతమవుతున్నది. రాష్ట్ర ప్రయోజనాల పై దూరదృష్టితో వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి.. ఆ బాధ్యత విస్మరించి తన పరివారానికి ఆస్తులు, భూములు కూడబెట్టడంలో బిజీగా ఉన్నారు
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 16, 2026