వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ నెల 20 నుంచి ఓపీ సేవలు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో పాటు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఆసుపత్రిని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
నిర్మాణ పనులు, విద్యుత్, నీటి సరఫరా, రోగులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు దసరా నుంచే ఓపీ సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
తొలిదశలో ఆసుపత్రిలోని రెండు అంతస్తుల్లో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదట రోజుకు సుమారు మూడు వేల మంది రోగులకు వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
డిసెంబరు 15 తర్వాత ఆసుపత్రిలో అన్ని వైద్య విభాగాలను అందుబాటులోకి తీసుకు వచ్చి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే వరంగల్తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతుంది. చుట్టుపక్కల జిల్లాల ప్రజలు వైద్య చికిత్సల కోసం హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది.