హర్మూజ్ జలసంధిలో ఓ కార్గో నౌక మునిగిపోవడంతో అందులోని చక్క పెట్టెలలో ప్యాక్ చేయబడిన ఖరీదైన వస్తువులు సముద్రంలో తేలియాడుతున్నాయి.
దుబాయ్ నుంచి వస్తున్న సింగపూర్కు చెందిన ‘జీఎఫ్ఎస్ ప్రైడ్’ అనే కంటైనర్ నౌక అక్టోబర్ 14న ప్రమాదానికి గురై హర్మూజ్ జలసంధిలో మునిగిపోయింది. ఈ నౌకలో ఐఫోన్లు, ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన సుమారు 2,500 కంటైనర్లు ఉన్నట్లు ఇరాన్ అధికారులు పేర్కొన్నారు.
నౌక మునిగిన తర్వాత సముద్రంలో అనేక ఐఫోన్ బాక్సులు, సుగంధ ద్రవ్యాల ప్యాకెట్లు నీళ్ళలో తేలాయి. ఈవిషయం తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు, వ్యక్తులు చిన్న పడవల్లో అక్కడకు చేరుకొని నీటిపై తేలుతున్న ఆ పెట్టెలను తీసుకుపోయారు. అంటే మన దేశంలో చమురు లేదా కూరగాయల లారీలు బోల్తా పడినప్పుడు చుట్టుపక్కల ఊళ్ళవారు బిందెలు, బకెట్లు, సంచులతో ఎత్తుకుపోయినట్లున్నమాట.
అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు నౌకలోని 21 మంది సిబ్బందిని వారే సురక్షితంగా రక్షించారు కూడా. నౌక మునిగిపోయి భారీగా నష్టం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సింగపూర్ అధికారులు వెల్లడించారు.
అయితే ఇరాన్ దాడి వలన ఈ నౌక మునిగిపోయిందా లేదా దేనినైన ఢీకొని మునిగిపోయిందా? అనే విషయం ఇంకా నిర్ధారించలేదు.