మక్కా నగరంపై డ్రోన్ దాడికి ప్రయత్నం జరిగిందని సౌదీ అరేబియా ప్రకటించింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు వెంటనే స్పందించి ఆ డ్రోన్‌ను అడ్డుకుని గాల్లోనే ధ్వంసం చేసినట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులే ఈ దాడికి పాల్పడి ఉంటారని సౌదీ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది.
సౌదీ నేతృత్వంలోని యెమెన్ కూటమి ప్రతినిధి తుర్కీ అల్ మాలికీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న సాయంత్రం 6:50 గంటలకు సౌదీ వైమానిక రక్షణ దళాలు దానిని గుర్తించి తక్షణమే స్పందించి ధ్వంసం చేశాయి. డ్రోన్ పవిత్ర నగరంపై నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే కూల్చివేసినట్లు తెలిపారు.
మక్కా నగరం, అక్కడి రెండు పవిత్ర మసీదులు, వాటిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల భద్రత తమకు అత్యంత కీలకమని అల్ మాలికీ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు.
సౌదీ కూటమి ప్రకటనపై హౌతీ ప్రతినిధులు స్పందించారు. మక్కా లేదా ఇతర ఇస్లామిక్ పవిత్ర స్థలాలపై తాము ఎన్నడూ దాడి చేయలేదని స్పష్టం చేశారు. డ్రోన్ దాడి ఎవరు చేశారో నిర్ధారించుకోకుండా సౌదీ అరేబియా తమపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హౌతీల ప్రతినిధి హజెమ్ అల్ అసద్ అన్నారు.
అయితే మక్కాపై దాడికి ప్రయత్నించడం ఇది రెండోసారి అని సౌదీ ప్రతినిధి తెలిపారు. ఇదివరకు అంటే 2017 జూలై 27న కూడా మక్కా వైపు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిగిందని గుర్తుచేశారు. మక్కాపై దాడి నేపధ్యంలో పశ్చిమాసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.