ఇది మహారాష్ట్ర బిజేపి ఎమ్మెల్యే పరాగ్ షా గురించి. ఆయనకు అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆయన ఆస్తులు రూ.3,300 కోట్లు పైమాటే. అలాంటి వ్యక్తి బిచ్చగాడిగా మారాడు. అంటే పదవి, ఆస్తులు కోల్పోవడం వలన కాదు.
తన జైన గురువు సూచన మేరకు ఒక్కరోజు బిచ్చగాడి వేషంలో ముంబై వీధుల్లో తిరుగుతూ బిచ్చమెత్తుకున్నారు. ఆ రోజంతా బిచ్చమెత్తుకుంటూ వచ్చిన డబ్బుతో కడుపు నింపుకొని రోడ్డు పక్కనే పడుకున్నారు.
మర్నాడు ఉదయం ఇంటికి చేరుకున్నాక, మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఒక్కరోజు దీక్ష నా ఆలోచనా దృక్పదాన్ని సమూలంగా మార్చేసింది. అందరూ నన్ను ఓ ధనవంతుడుగా, ఎమ్మెల్యేగా చూసే విధానానికి, నేను రోడ్లపై ప్రజల ముందు చేయి చాపి అడుక్కునేటప్పుడు నన్ను చూసే విధానానికి తేడాతో నేనేమిటో తెలుసుకోగలిగాను.
ఈ గౌరవ మర్యాదలన్నీ నా డబ్బు, పదవి, పరపతికి లభిస్తున్నవే తప్ప వ్యక్తిగా నాకు కావని గ్రహించగలిగాను. చేయి జాపి అడుక్కుంటునప్పుడు నా కంటే సామాన్య ప్రజలు ఉన్నతమైన స్థానంలోకి మారుతారని గ్రహించాను,” అని పరాగ్ షా చెప్పారు.