భారత రత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి... పరిచయం అవసరం లేని పేరు. దాదాపు ప్రతీ ఇంట్లో ఆమె పాడిన కీర్తనలు వినపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా తమిళనాడులో చాలా ఇళ్ళలో ఆమె కీర్తనలతోనే రోజు ప్రారంభం అవుతుందంటే అతిశయోక్తి కాదు.
తన అపూర్వమైన గళంతో దశాబ్దాల పాటు ప్రజలను అలరించిన ఆమె జీవిత గాథ ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఈ లెజెండరీ బయోపిక్ టైటిల్, ఫస్ట్ లుక్ బుధవారం సాయంత్రం 5:15 గంటలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.
“కొన్ని లెజెండ్స్ కాలాన్ని దాటి నిలిచిపోతారు. కొన్ని మెలోడీలు తరాలను దాటి జీవిస్తాయి. కొన్ని కథలు చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటాయి. ఈ రోజు ఆ ప్రయాణం మొదలవుతోంది” అంటూ ఆమె గురించి చెప్పిన మాటలు విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది.
ఈ సినిమాలో రష్మిక మందన ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నటించబోతున్నారు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, రాక్ లైన్ ఎంటర్‌టైన్మెంట్, బన్నీ వాస్ వర్క్స్‌బ్యానర్లపై అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ కలిసి నిర్మించబోతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు.
ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు చెన్నైలోని ది మ్యూజిక్ అకాడమీలో ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన కీర్తనలు, భక్తి గీతాల కచేరీ జరుగుతుంది. దీని ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమంలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటించబోతున్నారు.