సికింద్రాబాద్ బొల్లారం కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల దొంగతనం కేసుని తెలంగాణ పోలీసులు చేధించారు. ఈ కేసు తెలంగాణ పోలీసుల సామర్ధ్యానికి మరోసారి చక్కటి నిదర్శనంగా నిలుస్తోంది.
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ నిన్న సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి, ఈ కేసు గురించి వివరించారు. అదే రెజిమెంట్‌లో 20వ బెటాలియన్‌లో పని చేసి సస్పెండ్ అయిన హవల్దార్ ఉప్పుతోళ్ళ మల్లేశ్ అలియాస్ రాజు (37) ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నైట్ విజన్ బైనాక్యులర్‌తో సహా మొత్తం ఆయుధాలు, తూటాలను మీడియా సమావేశంలో చూపారు.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లోని జంగారెడ్డిపల్లికి చెందిన మల్లేశ్ ఆర్మీలో 16 ఏళ్ళపాటు పనిచేశాడు. కానీ వివిధ కారణాలతో అతనిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఆ ఉక్రోషంతోనే మల్లేశ్ ఈ దొంగతనానికి పాల్పడ్డాడు.
ముందుగా రెండు రోజులు రెక్కీ నిర్వహించిన తర్వాత గత నెల 30న రాత్రి 11 గంటలకు స్కూటీపై కార్గిల్ గేటులో నుంచి లోనికి ప్రవేశించి వచ్చి ఆయుధాగారం తాళాలు పగులగొట్టి ఒక్కో ఆయుధాన్ని బయట చీకటిగా ఉన్న ప్రదేశంలో దాచిపెట్టాడు. తర్వాత వాటి తూటాలు కూడా అక్కడికి తరలించాడు.
ఆ తర్వాత వాటన్నిటినీ బాలాజీ నగర్‌లోని తన ఇంటికి అక్కడి నుంచి కారులో అమ్రాబాద్‌లోని తన స్నేహితుడు ఇంటికి తీసుకువెళ్ళి దాచి పెట్టాడు.
పోలీసులు, మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టడంతో అప్రమత్తమైన మల్లేశ్, ఈ నెల 8న మళ్ళీ అమ్రాబాద్ వెళ్ళి వాటన్నిటినీ తన సొంత ఇంటి సమీపంలో దాచి పెట్టాడు.
పోలీసులు విచారణ మొదలుపెట్టిన ఒకటి రెండు రోజులలోనే మల్లేశ్ ఈ దొంగతనానికి పాల్పడి ఉంటాడని అనుమానించి, అదుపులో తీసుకొని ప్రశ్నించారు. అతను సమాధానాలు చెప్పలేక తడబడుతుండటంతో తమ అనుమానం నిజమేనని అర్ధమైంది.
దీంతో వారు మల్లేశ్ తండ్రికి, భార్యకు ఈ కేసు తీవ్రత గురించి వివరించగా వారు మల్లేశ్‌ని గట్టిగా నిలదీశారు. అప్పుడు తానే ఈ దొంగతనం చేశానని మల్లేశ్ ఒప్పుకున్నాడు. వారు పోలీసులకు ఈ సమాచారం తెలియజేయడంతో మల్లేశ్‌ని అరెస్ట్ చేసి ఆయుధాలు, తూటాలు వగైరా అన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు, “ అని డీజీపీ సీవీ ఆనంద్ వివరించారు.