బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పోలీసులు ఆయన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఆయన స్పీకర్ అంటే తనకు చాలా గౌరవం ఉందని, ఏదో ఆవేశంలో అలా మాట్లాడానన్నారు. ఆ మాటలు వెనక్కు తీసుకుంటున్నానని, తన మాటల వలన స్పీకర్ బాధ పడితే క్షమించాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
కానీ ఆయనపై అనర్హత వేటు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతోంది. కనుక తాత మధుని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్సీలకు త్రీ-లైన్-విప్ జారీ చేసింది.
దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంఆయనపై అనర్హత వేటు తీర్మానాన్ని మండలిలో ప్రవేశపెడితే, 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తప్పనిసరిగా సభలోనే ఉంది ఓటింగ్ ద్వారా ఓడించాలని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా భిన్నంగా వ్యవహరిస్తే వారిపై కటిన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది.
శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉంది కనుక అనర్హత తీర్మానాన్ని ఆమోదింపజేసుకోవడం పెద్ద కష్టం కాదు. మండలిలో బీఆర్ఎస్ పార్టీకి 17 మంది ఎమ్మెల్సీలు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 13 మంది, బీజేపీకి ముగ్గురు, ఎంఐఎంకు ఇద్దరు ఉన్నారు. మరో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్సీలున్నారు.
కనుక మండలిలో కూడా ఇతర పార్టీల మద్దతుతో ఈ తీర్మానం ఆమోదింపజేసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఊహించని ఎదురుదెబ్బే అవుతుంది. శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోతే, ఒక ఎమ్మెల్సీని కోల్పోవడం ఎదురుదెబ్బే కదా?