ఫ్లాష్ బ్యాక్ మరిచి సురేఖ గురించి బీఆర్ఎస్‌ మాట్లాడితే...

September 05, 2026


img

మాజీ మంత్రి కొండా సురేఖను బీఆర్ఎస్‌ పార్టీలో చేర్చుకోబోమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు బలమైన కారణమే ఉంది. ఇదివరకు నటి సమంత విషయంలో ఆమె కేటీఆర్‌పై చేసిన సంచలన ఆరోపణలు, అందుకు కేటీఆర్‌ ఆమెపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేయడం వంటివి బలమైన కారణాలుగా కనిపిస్తున్నాయి. 

అయితే బీసీ మహిళా మంత్రి కొండా సురేఖని ఆవిధంగా తొలగించడం సబబు కాదని, ఆమె, కుమార్తె సుస్మిత అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పడం లేదని జగదీష్ రెడ్డి విమర్శించడం, బీఆర్ఎస్‌ పార్టీకే బ్యాక్ ఫైర్ అవుతుందని మరిచినట్లున్నారు. 

దళిత ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్యని, బీసీ మంత్రి ఈటల రాజేందర్‌ని ఎంత అవమానకరంగా కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి బయటకు సాగనంపారో అందరికీ తెలుసు. ఆ తర్వాత కూడా ఈటల రాజేందర్‌ని అసైన్డ్ భూములు కబ్జా చేశారంటూ ఏవిధంగా వేధించారో, ఆయనను ఉప ఎన్నికలలో ఓడించి శాశ్వితంగా రాజకీయ సమాధి కట్టాలని ఎంతగా ప్రయత్నించారో అందరూ చూశారు. అదేవిధంగా కూతురు కల్వకుంట్ల కవితని ఏవిధంగా అవమానకరంగా బయటకు సాగనంపారో అందరూ చూశారు.

కొండా సురేఖకు ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేదేమి? అని నిలదీస్తున్నప్పుడు, కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌, అన్న కేటీఆర్‌, బావ హరీష్‌ రావు ముగ్గురిపై సంధిస్తున్న ప్రశ్నలకు, చేస్తున్న విమర్శలకు నేటికీ వారు జవాబు చెప్పడం లేదు. 

కాంగ్రెస్‌, బిజేపి నేతలు కూడా ఇదే గుర్తుచేస్తున్నారు కదా? కానీ వాటికీ బీఆర్ఎస్‌ పార్టీ సమాధానాలు చెప్పడం లేదు. మరి జగదీష్ రెడ్డి సమాధానాలు చెప్పగలరా? కనుక గులాబీ అద్దాల మేడలో కూర్చొని దారిన పోయేవారిపై రాళ్ళు విసరడం మంచిది కాదని గ్రహిస్తే మంచిది.


Related Post