కేసీఆర్‌ శాసనసభకు రారు: కేటీఆర్‌ సెల్ఫ్‌ గోల్!

September 03, 2026


img

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, మంత్రి పదవుల వ్యవహారం, నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీని క్రమంగా బలహీనపరుస్తున్నాయి. ప్రతిపక్షానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. కానీ సరిగ్గా ఇదే సమయంలో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్య బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఇబ్బందిగా మారింది.

కేసీఆర్‌ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. ఆయన ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతారని కేటీఆర్‌ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే మరో రెండేళ్లపాటు కేసీఆర్‌ అసెంబ్లీకి రారని కేటీఆర్‌ ప్రకటించినట్లే.

నిజానికి ఈ ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం ఇవ్వకుండా దాటవేయొచ్చు. లేదా పార్టీ వ్యూహం ప్రకారం నిర్ణయం ఉంటుందని చెప్పొచ్చు. కానీ ‘సీఎంగానే కేసీఆర్‌ అసెంబ్లీలో అడుగుపెడతారు’ అని స్పష్టంగా చెప్పడంతో తాము పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఆయనే ఓ బలమైన ఆయుధం అందించినట్లయింది.

దీనిని సీఎం రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్‌ మంత్రులు అందిపుచ్చుకుని.. “కేసీఆర్‌ జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి రావడానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం సరైన నిర్ణయమేనా? ఇలాంటి వ్యక్తికి మళ్లీ అధికారం కట్టబెట్టడం అవసరమా?” అంటూ ప్రజలను ప్రశ్నించకుండా ఉండరు.

పలు అంశాలతో అధికార పార్టీని ఎండగడుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇప్పుడు కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదనే దానిపై ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని కేటీఆర్‌ కల్పించారు. కాంగ్రెస్‌లో అల్లకల్లోలం నెలకొని ఉన్నప్పుడు దానిపై మరింత ఒత్తిడి పెంచి రాజకీయంగా పైచేయి సాధించాల్సిన బీఆర్‌ఎస్‌.. కేటీఆర్‌ చేసిన ఈ ఒక్క వ్యాఖ్యతో కాంగ్రెస్‌కు ఊపిరి పోసినట్టయింది.

అంతేకాదు.. అధికార పార్టీకి ఒక బలమైన రాజకీయ ఆయుధాన్ని కూడా అందించినట్టయింది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యను బీఆర్‌ఎస్‌ పార్టీకి సెల్ఫ్‌ గోల్‌గానే భావించాల్సి ఉంటుంది.


Related Post