హరీష్ రావు క్షుద్ర పూజలు నిజమే: కవిత

August 28, 2026


img

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్‌ రావుపై నిన్న తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.    

ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “గుంటనక్క హరీష్‌ రావు క్షుద్రపూజలు చేస్తారనే విషయం అందరికీ తెలుసు. అయితే అది తెలంగాణ రాష్ట్రం నాశనం అవ్వాలని కాదు. నా తండ్రి కేసీఆర్‌ ఆరోగ్యం చెడిపోవాలని చేస్తుంటారు.

అయన ఎలాగైనా కేసీఆర్‌, కేటీఆర్‌ చేతుల్లో నుంచి బీఆర్ఎస్‌ పార్టీని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకే క్షుద్రపూజలు చేయిస్తున్నారు. అలాగే ఆర్ఎస్ఎస్, బిజేపి, కాంగ్రెస్‌ పెద్దలతో రహస్య మంతనాలు కూడా చేస్తున్నారు,” అని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 

నేనిప్పుడు బీఆర్ఎస్‌ పార్టీలో లేను గనుక అది మూడు చెక్కలైన వెయ్యి చెక్కలైనా నాకు అనవసరం అంటూనే, “ఎవరికీ తెలీని ఓ రహస్యం చెపుతాను. నగరంలో ‘రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్’లో ఓ  ఇంటికి  ఆర్ఎస్ఎస్ అగ్రనేత ఒకరు వస్తుంటారు.

అయన వచ్చినప్పుడల్లా మిరియాలు, పసుపు కలిపిన పాలు హరీష్‌ రావు ఇంటికి పంపిస్తారు. రహస్య సమావేశానికి హాజరు కావాలని సూచించే సంకేతం అది. 

ఆ పాలు రాగానే హరీష్‌ రావు ఆ రోజు అన్ని కార్యక్రమాలు కట్టిబెట్టి ఆయనతో రహస్య సమావేశానికి హాజరవుతారు. బీఆర్ఎస్‌ పార్టీని ఏవిధంగా బిజేపిలో విలీనం చేయాలనే దానిపై వారు చర్చిస్తుంటారు. 

ఇదేమీ నేను ఊహించి చెప్పడం లేదు. ఇటీవల హరీష్‌ రావు మెదక్ జిల్లా నేతలతో రహస్య సమావేశమైనప్పుడు దానిలో పాల్గొన్న ఓ ఎమ్మెల్యే వచ్చి నాకు ఈ విషయం చెప్పారు. హరీష్‌ రావు కాంగ్రెస్‌, బిజేపి రెండు పార్టీల అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారు. 

నాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి టీడీపిని స్వాధీనం చేసుకున్నట్లే, హరీష్‌ రావు కూడా కేసీఆర్‌కి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్‌ పార్టీని స్వాధీనం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారు. అయితే ఆయన బీఆర్ఎస్‌ పార్టీని ఏం చేసుకుంటే నాకెందుకు? అని ఊరుకోవచ్చు. కానీ గుంటనక్క స్వభావం ప్రజలకు తెలియాలనే ఈ విషయం బయటపెడ్తున్నాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.            


Related Post