ఇటీవల జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజ్ ‘ఉత్తమ అధికారి’ అవార్డు అందుకున్నారు. రెండు వారాలు తిరక్క మునుపే ఆయన ఇళ్ళపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో గురువారం ఉదయం ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ బోడుప్పల్‌లోని జయరాజ్ నివాసంతో పాటు భూపాలపల్లి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా తాండూరులోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన బంధుమిత్రుల ఇళ్ళతో కలిపి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం ములుగు జిల్లా ఇన్‌ఛార్జ్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. భూపాలపల్లి పరిధిలో ఇసుక అక్రమ రవాణా, గనుల వ్యవహారాల్లో అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
ఏసీబీ సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు, బినామీ ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
భూపాలపల్లి మైన్స్ ఏడీఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.