మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు హనుమకొండలో కలెక్టర్ కార్యాలయం వద్ద టీఎన్జీవోలు నిర్వహిస్తున్న ధర్నాలో హరీష్ రావు కూడా పాల్గొన్నారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఆయనకు అభ్యంతరం చెప్పారు.
టీఎన్జీవోల ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొంటే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది కనుక తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. కానీ హరీష్ రావు అందుకు నిరాకరించడంతో పోలీసులు ఆయనని బలవంతంగా అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది.
పోలీసులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో అక్కడ కాసేపు తోపులాటలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడ నిజంగానే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానీ పోలీసులు హరీష్ రావుని అరెస్ట్ చేసి కారులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఎన్జీవోల తరపున వారి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, పోలీసులు అరెస్ట్ చేయించడాన్ని హరీష్ రావు తప్పు పట్టారు.