తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబంతో మొదలైన వివాదం, మెల్లగా సమసిపోతుందని అనుకుంటే, మంత్రి కొండా సురేఖపై కటిన చర్యలు తప్పవని మల్లు రవి చెప్పారు. కొన్ని గంటల వ్యవధిలోనే కొండా దంపతులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి ఈ వ్యవహారం గురించి మాట్లాడారు.
అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ, “మా కుమార్తె సుస్మిత చిన్న పిల్లేమీ కాదు. ఆమెకు 15 ఏళ్ళ వయసున్న కొడుకున్నాడు. ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు. మాట్లాడగలదు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కనుక ఆమెను ప్రశ్నించే హక్కు మాకు కూడా లేదు. ఆమె చేసిన వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు,” అని కొండా మురళి చెప్పారు.
అయితే తాము ఓ బిల్లు గురించి మాట్లాడేందుకే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశాము తప్ప ఈ వ్యవహారం గురించి కాదని కొండా మురళి చెప్పడం విశేషం.
“మీ భార్యని మంత్రి పదవిలో నుంచి తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ వీడబోతున్నారా?” అంటూ విలేఖరి అడిగిన ప్రశ్నకు మేము ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతాము. గాంధీ కుటుంబంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది,” అని కొండా మురళి చెప్పారు.