‘టాక్సిక్’ కేసులు షురూ

August 23, 2026


img

హైదరాబాద్‌ మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం సాయంత్రం ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు గాయపడ్డారు. వీరిలో ఒకరికి కాలు ఫ్రాక్చర్ కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహణలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, ఈ కార్యక్రమానికి హాజరైనవారిని నియంత్రించడంలో విఫలమైనందుకు, యూనివర్సిటీ ఆవరణలో ప్రమాదం జరిగి విద్యార్ధులు గాయపడినందుకు పోలీసులు మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం, టాక్సిక్ చిత్ర బృందంపై వేర్వేరుగా కేసులు నమోదు చేశారు.  

ఇలాంటి సినిమా ఈవెంట్స్ కాలేజీలు, యూనివర్సిటీలలో నిర్వహించడమే తప్పని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రమాదం జరిగి నలుగురు విద్యార్ధులు గాయపడటంతో ఇప్పుడు పోలీస్ కేసు నమోదవడంతో, మల్లారెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదివరకు పుష్ప రిలీజ్‌ సమయంలో హైదరాబాద్‌ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒక వివాహిత మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి నేటికీ చికిత్స తీసుకుంటున్నాడు. కనుక భారీగా జనసమీకరణ చేసినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిసి ఉన్నప్పుడు, యూనివర్సిటీ ఆవరణలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఉంటే బాగుండేది. కానీ నిర్వహించి విమర్శల పాలవుతున్నారు.  టాక్సిక్  ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Related Post