ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతించలేదు. కనుక సిఎం అమెరికా పర్యటనకు అనుమతించనందుకు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను విద్యారంగంలో అమెరికన్ యూనివర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేందుకు వెళ్ళాలనుకున్నానని, కానీ కేంద్ర ప్రభుత్వం తన అమెరికా పర్యటనని కూడా రాజకీయ కోణంలో నుంచి చూసి అనుమతి నిరాకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో, సిఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని ఈ నెల 23న హైదరాబాద్ తిరిగి చేరుకోనున్నారు.
కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న ఈ విమర్శలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, “విదేశాలలో ప్రముఖుల పర్యటనలలో వారి కార్యక్రమాలకు సంబంధించి వారు పంపిన వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది.
వారి పదవిని బట్టి వారు ఏ ఉద్దేశ్యంతో విదేశీ పర్యటనలు చేస్తున్నారో పరిశీలిస్తాం. వారి కార్యక్రమాలు అందుకు అనుగుణంగా ఉంటే అనుమతి లభిస్తుంది. కానీ తెలంగాణ సిఎం అమెరికా పర్యటన అందుకు అనుగుణంగా లేదు కనుక అనుమతి నిరాకరించబడింది. ఈ నిర్ణయంలో ఎటువంటి రాజకీయాలకు తావు లేదు,” అని తెలిపారు.