తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) తొలి కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రంలో ఆహారం, నిత్యావసర ఔషధాల నాణ్యత, భద్రత ప్రమాణాలను మరింత పటిష్టంగా అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో లైసెన్స్ పొందిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు, ఫార్మా సంస్థల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలను ఒకే పరిపాలనా వ్యవస్థ కిందకు తీసుకొచ్చారు. నాసిరకం, కల్తీ, ప్రమాదకర ఆహార ఉత్పత్తులతో పాటు నకిలీ మందుల తయారీ, విక్రయాలను అడ్డుకోవడంపై టీజీ సేఫ్ దృష్టి పెట్టనుంది.
నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు తనిఖీలను విస్తృతం చేసి, రెండు విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.
తొలి దశలో ఆహార, ఫార్మా సంస్థలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఏకీకృత వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.