నేడు పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ భారత్‌పై నిప్పులు చెరిగారు. సింధూ జలాలు మా హక్కు. దానిలో ప్రతీ బొట్టుపై మాకు హక్కుంది. భారత్ దానిని కాదంటే ‘రెడ్ లైన్’గానే పరిగణిస్తాము.
గత ఏడాది మేలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టినప్పుడు ఏవిధంగా దీటుగా జవాబిచ్చామో ఈసారి అంతకంటే దీటుగానే బదులిస్తాం.
మేము ఎల్లప్పుడూ ఇరుగుపొరుగు దేశాలతో శాంతినే కోరుకుంటాము. కానీ భారత్ దానిని మా చాతగానితనంగా భావిస్తే చూస్తూ ఊరుకోము.
మా దేశ సార్వభౌమత్వానికి, ప్రయోజనాలకు భంగం కలిగిస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి,” అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌ని హెచ్చరించారు.
గత ఏడాది ఏప్రిల్ నెలలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలోకి ప్రవేశించి పర్యాటకులను అతికిరాతకంగా హత్య చేసి పారిపోయారు.
అందుకు ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ వాయుసేన స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించింది. అప్పుడు పాక్ పాలకులు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని బ్రతిమాలుకొని భారత్‌పై ఒత్తిడి చేయించి యుద్ధం నిలిపివేయించారు. కానీ నేడు పాక్ ప్రధాని మాటలు అందుకు భిన్నంగా ఉన్నాయి.
ఆనాటి నుంచే భారత్ నుంచి పాక్‌లోకి ప్రవహిస్తున్న సింధూ జలాలను అడ్డుకట్ట వేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఇది ఆపరేషన్ సిందూర్ కంటే పాక్ మీద దీర్గకాలం పెను ప్రభావం చూపిస్తోంది. కనుక పాక్ ప్రధాని ఆవేశం అర్థం చేసుకోవచ్చు. కానీ అయన ప్రగల్భాలే నవ్విస్తాయి.