తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ రెండు పధకాల అమలు కోసం గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై కూడా స్టే విధించింది. కనుక వాటి ఆధారంగా ఇకపై లబ్దిదారులకు చెల్లింపులు చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విజయ్ గోపాల్ అనే అడ్వకేట్ దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
విజయ్ గోపాల్ ఏమని వాదించారంటే, “ఇటువంటి పధకాల గురించి ముందుగా శాసనసభలో చర్చించి, వాటి కోసం బిల్లు ప్రవేశపెట్టి సభ ఆమోదంతో చట్టం చేయాలి. కానీ ప్రభుత్వం అదేమీ చేయకుండా కేవలం జీవోలు జారీ చేసి ఈ పధకాన్ని వివిధ వర్గాలకు విస్తరించుకుంటూపోతోంది. ఇది చట్టవిరుద్ధం. ఇలాంటి పధకాల వలన ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడుతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.13,000 కోట్లు వీటి కోసం ఖర్చుచేశారు. అధికారంలో ఉన్న పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసం ఈ రెండు పధకాల కోసం ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు చేయడం సరికాదు.”
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ విచారణకు హాజరయ్యి కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని కోరడంతో న్యాయస్థానం తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.