సర్ ప్రక్రియలో ఓటర్లు తమ కుటుంబం, చిరునామా తదితర వివరాల ధృవీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సమర్పిస్తున్నారు. కానీ దానిని గుర్తింపు కార్డుగా అంగీకరించమని ఈసీ స్పష్టం చేసింది.
అది కేవలం రేషన్ కార్డుకి సమానమైన గుర్తింపు కార్డు మాత్రమేనని, సుప్రీంకోర్టు ఆమోదించిన 12 రకాల గుర్తింపు పత్రాలలో రేషన్ కార్డు లేనందున తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ని గుర్తింపు కార్డుగా అంగీకరించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లిఖిత పూర్వకంగా తెలియజేసింది.
కనుక సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్నవారు తప్పనిసరిగా సుప్రీంకోర్టు ఆమోదించిన 12 రకాల గుర్తింపు పత్రాలలో ఏదో ఒకటి చూపించి తమ ఓటు హక్కు కాపాడుకోవాల్సి ఉంటుంది.
రేషన్ కార్డు ఆధారంగా తహసీల్దారులు ప్రజలకు ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ జారీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 25న జీవో నం.172 జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్స్ కూడా దాఖలయ్యాయి.
కనుక వీటిని పరిగణనలోకి తీసుకొని, ఓటర్ల నమోదు చేయవచ్చా లేదా?అని రాష్ట్ర ఎన్నికల సంఘం వ్రాసిన లేఖకు సమాధానంగా ఈసీ వద్దని చెప్పింది. అయితే 2013, జూలై 25న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ మాత్రం పరిగణనలోకి తీసుకోవచ్చని ఈసీ సూచించింది.