సంగారెడ్డి జిల్లా పరిధిలోని జాతీయ రహదారి-65పై మంగళవారం రెండు ప్రమాదాలు జరిగాయి. వీటిలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో యూటర్న్ తీసుకుంటున్న ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురు మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా కర్ణాటకలోని రాజగిరా ప్రాంతానికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు.
పొట్టకూటి కోసం తెలంగాణకు వచ్చి పని ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరో ప్రమాదం కోహిర్ మండలం కవేలి వద్ద జరిగింది. అతివేగంతో వచ్చిన మూడు కార్లు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఒకే రోజు NH-65పై జరిగిన రెండు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. ఈ రెండు ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.