బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియోలో సర్ పేరుతో తన పేరు ఓటర్ల జాబితాలో నుంచి తొలగించారని ఆరోపించారు.
ఈ విషయం కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి రావడంతో వెంటనే స్పందిస్తూ, ‘సర్ ప్రక్రియలో భాగంగా అయన పేర్కొన్న శాంతినగర్ చిరునామాలో వివరాలు నమోదు చేసేందుకు సిబ్బంది వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉండటం లేదని తెలిసి, చిరునామా మారిందని మాత్రమే పేర్కొన్నారు. కనుక ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో తెలియజేసే గుర్తింపు కార్డు, ఆధారాలు సమర్పిస్తే ఆ చిరునామాకి మార్చుతాము తప్ప ఆయన ఓటు తొలగించడం లేదు,” అని పేర్కొంది.
జిల్లా ఎన్నికల అధికారి జగదీశ్ మీడియాతో మాట్లాడుతూ, “నేను స్వయంగా ప్రకాష్ రాజ్‌తో మాట్లాడాను. గత నాలుగేళ్ళుగా శాంతి నగర్లో ఉండటం లేదని వేరే చోట ఉంటున్నానని చెప్పారు. కనుక ఆయన అదే విషయం తెలియజేస్తూ ఫారమ్-6 సమర్పిస్తే సరిపోతుంది. ఆ చిరునామాకి ఓటు బదిలీ చేస్తాము. తన ఓటు తొలగించారని అయన చెప్పడం సరికాదు,” అని అన్నారు. బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పోరేషన్ కూడా ఇదే చెప్పింది.