జనసేనతో బిజేపి పొత్తు ఉండదు: రాంచందర్ రావు

August 09, 2026


img

త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీ, మజ్లీస్ పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తాయి. ఫలితాలు వెలువడిన తర్వాత వాటిలో ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీ, జిహెచ్‌ఎంసి పీఠం దక్కించుకునేందుకు మజ్లీస్ సాయం తీసుకుంటుంది. 

మరి బిజేపి పరిస్థితి ఏమిటి? అంటే ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. ఏపీలో టీడీపి, జనసేన, బిజేపి మూడు కలిసున్నప్పటికీ, ఆ పొత్తు అక్కడికే పరిమితమని, అవి ఎన్డీయేలో భాగస్వాములు మాత్రమేనన్నారు. తెలంగాణలో జనసేనతో సహా మరే పార్టీతో పొత్తు పెట్టుకోమని రామచందర్ రావు చెప్పారు. 

రెండు నెలల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి తెలంగాణలో జరిగే ఎన్నికలలో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తుందని స్వయంగా చెప్పారు. అంతకు ముందు ప్రధాని మోడీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్‌ నివాసానికి వెళ్ళారు. కనుక తెలంగాణలో బిజేపి, జనసేనల పొత్తు ఉండవచ్చని అందరూ భావించడం సహజం. కానీ ఉండదని రామచందర్ రావు స్పష్టం చేశారు. కనుక ఒకవేళ జిహెచ్‌ఎంసి ఎన్నికలలో జనసేన కూడా పోటీ చేస్తే దాంతో కూడా బిజేపి పోటీ పడాల్సి ఉంటుంది.


Related Post