కెజెక్యు విషాదంలో నుంచి పాజిటివ్ టాక్..

August 09, 2026


img

‘దసరా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ‘కెజెక్యు’ (కింగ్ జాకీ క్వీన్) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1990ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ క్రైమ్ డ్రామాలో శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా విడుదలయ్యే ముందు దర్శకుడు కిరణ్ కుమార్ ఆకస్మికంగా మరణించడంతో విషాదం నెలకొంది. ఆ విషాదంతోనే సినిమా విడుదల చేయగా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇది దర్శకుడు కిరణ్ కుమార్‌కి ప్రేక్షకుల నివాళిగా భావించవచ్చు. నిర్మాత సుధాకర్ చెరుకూరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయించి సినిమాను విడుదల చేశారు.

ప్రేమ, స్నేహం, ద్రోహం చుట్టూ ముగ్గురు వ్యక్తుల జీవితాలు ఎలా మలుపులు తిరిగాయనే కథాంశంతో ‘కె.జె.క్యు’ తెరకెక్కింది. క్రైమ్, యాక్షన్ అంశాలను కలిపి దర్శకుడు ఈ కథను రూపొందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, శశి ఓదెల నటనకు ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. 

కెజెక్యుకు పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించగా, నాగేశ్ బనెల్ సినిమాటోగ్రఫీ, శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ చేశారు. ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆగస్టు 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా హిట్ అవడంతో అప్పుడే ఓటీటీ ప్రేక్షకులు కెజెక్యు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ సెప్టెంబర్‌లో మొదటి వారం వరకు ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. 


Related Post

సినిమా స‌మీక్ష