రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని దీపావళి సందర్భంగా భారత్‌లో నవంబర్ 8న విడుదల చేయనున్నారు.
అయితే ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం రెండు రోజుల ముందుగానే, అంటే నవంబర్ 6న సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లిష్‌తో పాటు ఇతర భాషల్లోనూ ఓవర్సీస్‌లో ముందుగానే ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. అలాగే కాజల్ అగర్వాల్ మందోదరిగా నటిస్తున్నారు.
చిత్రానికి హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం, యాక్షన్ కొరియోగ్రఫీ: టెర్రీ నోటరీ, గై నోరిస్ చేస్తున్నారు.
విజువల్ ఎఫెక్ట్స్‌ను డీఎన్‌ఈజీ, రీడిఫైన్ సంస్థలు రూపొందిస్తున్నాయి. రామాయణను ఐమ్యాక్స్ కోసం ప్రత్యేకంగా కూడా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల రామాయణ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమాను నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యశ్ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.