కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ నీట్ సమస్యపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుని తప్పు పట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బిజేపి ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
“నాడు తెలంగాణలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీక్ అయితే మంత్రిగా ఉన్న మీరు, ముఖ్యమంత్రిగా ఉన్న మీ తండ్రి కేసీఆర్ రాజీనామాలు చేశారా? గ్లోబరీనా నిర్లక్ష్యంగా కారణంగా రాష్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి మీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించిందా? లేదు కదా?
నాడు మీ హయంలో ప్రశ్నాపత్రాలు లీక్ అయి లక్షల మంది విద్యార్ధులు నష్టపోయినా, 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా మీరు నైతిక బాధ్యత వహించలేదు. కానీ ఇప్పుడు నీట్ అంశంపై విద్యార్ధులతో కలిసి ధర్నాచౌక్‌లో నిరసనలలో పాల్గొంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరడం విడ్డూరంగా ఉంది.
నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీలో 47 మందిని తొలగించింది. మళ్ళీ వెంటనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించింది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్ధులకు క్షమాపణలు కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇంత బాధ్యతగా వ్యవహరిస్తుంటే, కేటీఆర్ విద్యార్ధులను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారు.
నీట్ నిరసనల వెనుక పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 480 సోషల్ మీడియా ఖాతాలను కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. వాటి ద్వారా కొందరు విద్యార్ధులను రెచ్చగొట్టినట్లు గుర్తించాయి. కనుక ప్రతిపక్షాలు, సంఘవ్యతిరేక శక్తుల ప్రచారాన్ని, వారి చెప్పుడు మాటలు నమ్మవద్దని ఈ సందర్భంగా నేను విద్యార్ధులకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని బండి సంజయ్ అన్నారు.