అవసరమైనవి చేయరు.. లేనివి నెత్తిన పెట్టుకుంటారు: కేటీఆర్‌

July 16, 2026


img

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మరోసారి సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకు పడ్డారు.

ఎయిర్ పోర్టు వరకు మెట్రో పొడిగించేందుకు నాడు కేసీఆర్‌ స్వయంగా భూమిపూజ చేసి కేంద్రం నిధులతో సంబంధం లేకుండా పనులు ప్రారంభించేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ పనులు మొదలుపెట్టకుండా రెండున్నరేళ్ళుగా కాలక్షేపం చేస్తున్నారు. పైగా మనకి అవసరం లేని రూ.14,000 కోట్ల ఎల్&టి అప్పుని ప్రజల నెత్తిన పెట్టారు. 

ఆరోజు మేము లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో పొడిగించేందుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరితే ఆ మార్గంలో అంత ట్రాఫిక్ లేదు. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుందంటూ అనుమతి నిరాకరించారు. ఇప్పుడు జిహెచ్‌ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి మెట్రో పనులు ప్రారంభిస్తాం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. 

ఈ కాంగ్రెస్‌, బిజేపిలు తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేవు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ మెట్రో పనులు ప్రారంభం అవుతాయి. అంత వరకు ఈ రెండు పార్టీల డ్రామాలు కొనసాగుతూనే ఉంటాయి,” అని కేటీఆర్‌ విమర్శించారు. 

జిహెచ్‌ఎంసి ఎన్నికల కోసమే కాంగ్రెస్‌, బిజేపిల హడావుడి అని కేటీఆర్‌ చెప్పేశారు కనుక వాటి కోసం బీఆర్ఎస్‌ పార్టీ హడావుడి కూడా మొదలవుతుంది. కనుక హైదరాబాద్‌ వేదికగా మళ్ళీ మూడు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటే రాజకీయ వాతావరణం మళ్ళీ వేడెక్కుతుంది.


Related Post