బీఆర్ఎస్‌ విమర్శించే వరకు కదలకపోతే..

July 15, 2026


img

తెలంగాణ సాగునీటి శాఖా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, యశస్విని తదితరులు మంగళవారం దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. 

మొత్తం అన్ని మోటార్లు ఆన్‌ చేసి రౌండ్ ది క్లాక్ నడిపిస్తూ గోదావరి వరద నీటిని ఎత్తిపోయాలని ఇంజనీర్లను ఆదేశించారు. 

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రూ.146 కోట్లు విడుదల చేశామని మంటి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

అయితే గత వారం పదిరోజులుగా మాజీ మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ళ, దేవాదుల విషయంలో చేస్తున్న విమర్శలు అందరికీ తెలిసిందే. 

“ఓ పక్క వేలాది క్యూసెక్కుల గోదావరి వరద నీరు వృధాగా దిగువకు పోతుంటే పంప్ హౌసులలో అన్ని మోటార్లను ఆన్‌ చేసి నీళ్ళు ఎందుకు ఎత్తిపోయడం లేదు?వాటి కింద సాగయ్యే పంట భూములను ఎందుకు ఎండబెడుతున్నారు? ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణగా నీళ్ళు విడిచిపెడుతున్నారా?” అంటూ కేటీఆర్‌, హరీష్‌ రావు తీవ్ర విమర్శలు చేశారు. 

వారు ఈ విమర్శలు చేసిన తర్వాత కాంగ్రెస్‌ మంత్రులు దేవాదులకు వెళ్ళి గోదావరి వరద నీటిని ఎత్తిపోయాలని ఆదేశించారు. కనుక మేము మేల్కొలిపిన తర్వాతే మంత్రులు మేల్కొని దేవాదుల వెళ్ళి మోటార్లు ఆన్ చేయించారని  బీఆర్ఎస్‌ నేతలు చెప్పుకోకుండా ఉంటారా? ఇదేదో ముందే చేసి ఉంటే ఈ గౌరవం కాంగ్రెస్‌ మంత్రులకే దక్కేది కదా? 


Related Post