హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడితో మరో అంతర్జాతీయ సంస్థ వస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అమెజాన్ ఈ కామర్స్ సంస్థ, అమెజాన్ వెబ్ సర్వీసస్ పనిచేస్తున్నాయి. తాజాగా అమెజాన్ డేటా సెంటర్ కూడా రాబోతోంది.
గత ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లో జరిగిన దావోస్ సదస్సు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, అమెజాన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెజాన్ మొత్తం రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. రాబోయే రెండేళ్ళలో ఈ డేటా సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్లాన్ చేసుకున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్‌కు 120 ఎకరాల భూమిని కేటాయించింది. అదనంగా రూ.125 కోట్ల విలువైన వివిధ రాయితీలు కూడా మంజూరు చేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదే ప్రాంతంలో మరో 202 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో మరో 98 ఎకరాలను కూడా అమెజాన్ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
అమెజాన్ డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ఐటీ మౌలిక వసతులు మరింత బలోపేతం కావడంతో పాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
మీర్‌ఖాన్‌పేట కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లికి వెళ్లనున్నారు. అక్కడ అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించనున్నారు.
ఈ రెండు కార్యక్రమాలు ముగిసిన తర్వాత వనపర్తి జిల్లాలో కొత్తకోటలో కొత్తగా నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవం చేసి విద్యార్ధులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తారు.