హైదరాబాద్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై సబ్ ఇన్‌స్పెక్టర్ పూజారి తిరుపతి తన ఆరున్నరేళ్ళ మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఘటనలో పోలీస్ శాఖ ఆయనపై చర్యలు తీసుకుంది. ఉన్నతాధికారులు ఆయనని తక్షణం ఉద్యోగంలో సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
రెండు రోజుల క్రితం ఆయన తన మనుమరాలి చేత కారు డ్రైవింగ్ చేయిస్తూ గంధంగూడ-బైరాగిగూడ ప్రధాన రహదారిపైకి వచ్చారు. ఆ సమయంలో ఆ ప్రాంతం చాలా రద్దీగా ఉంది. కొంత మంది వ్యక్తులు కారు అడ్డుకొని అంత చిన్నపిల్ల చేత కారు ఎందుకు నడిపిస్తున్నారని నిలదీయగా, ‘నేను ఎవరో తెలుసా? సబ్ ఇన్‌స్పెక్టర్‌ని. నా యిష్టం. అయినా ఇది ఆటోమేటిక్ కారు. పక్కనే నేను కూర్చొని కారుని కంట్రోల్ చేస్తున్నా కదా? మీకెందుకు?” అంటూ దురుసుగా జవాబిచ్చారు.
చుట్టుపక్కల ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వారి ఆదేశం మేరకు పోలీసులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్లు 180, 184 కింద ఆయనపై కేసు నమోదు చేసి కారుని స్వాధీనం చేసుకున్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ట్రాఫిక్ నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.