విక్రమ్‌-1 ప్రయోగం వారం రోజులకు వాయిదా

July 11, 2026
img

భారత అంతరిక్ష రంగంలో కీలక ఘట్టంగా భావిస్తున్న విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగం ‘మిషన్ ఆగమన్’ను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో, స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించాయి. 

జూలై 12లోగా దీనిని ప్రయోగించాలని ముందు నిర్ణయించినప్పటికీ, కొన్ని సాంకేతిక సమీక్షల అనంతరం ఈ ప్రయోగాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రయోగ తేదీని ఆగస్ట్ 4వరకు పొడిగించారు. ఈ మేరకు కొత్తగా నోటం జారీ చేశారు. రాకెట్‌లో గుర్తించిన చిన్నచిన్న సాంకేతిక సమస్యలని సరిచేసిన తర్వాత ప్రయోగం చేపడతామని  ఇస్రో అధికారులు తెలిపారు. 

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌గా గుర్తింపు పొందింది. 

శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం తొలి ప్రయోగ వేదికపై ఇప్పటికే ఈ రాకెట్‌ను సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, దశల విభజన, గైడెన్స్, నావిగేషన్, నియంత్రణ వ్యవస్థల పనితీరును పరీక్షించడంతో పాటు సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్‌లోకి చేరుకునే సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు.

ప్రయోగం వాయిదా పడినప్పటికీ ఇది సాధారణ భద్రతా ప్రక్రియలో భాగమేనని, విజయవంతమైన ప్రయోగానికి అన్ని వ్యవస్థలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే కౌంట్‌డౌన్ ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు.


Related Post