తెలంగాణా ప్రభుత్వానికి కవిత డెడ్ లైన్

July 09, 2026


img

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 'బాయిబాట' కార్యక్రమంలో భాగంగా నేడు కొత్తగూడెంలో సింగరేణి బొగ్గు గని కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘానికి తనను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నందుకు ఆమె ముందుగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సింగరేణి కార్మికుల సమస్యల గురించి మీడియాతో మాట్లాడుతూ వారి తరపున ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. 

1. ప్రస్తుతం అమల్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలి.

2. డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రతి నెల రెండు మెడికల్ బోర్డులను నిర్వహించాలి. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. 

3. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం తక్షణం వసూలు చేసి సింగరేణికి అందించాలి. 

4. సింగరేణికి కేటాయించాల్సిన బొగ్గు బ్లాక్‌లను వెంటనే అప్పగించాలి. 

5. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించాలి. 

6. సింగరేణి కార్మికులకు మెరుగైన భద్రతా పరికరాలు, తాగునీరు, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలి. 

మెడికల్ బోర్డుల నిర్వహణపై ప్రభుత్వం లేదా సింగరేణి యాజమాన్యం ఆగస్ట్ 20లోగా స్పష్టమైన ప్రకటన చేయాలి. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. లేకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. త్వరలో జరగనున్న సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్‌కు మద్దతు ఇవ్వాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.


Related Post