రైతులకు ఉపయోగపడాల్సిన కాళేశ్వరం రాజకీయాలకు!

July 07, 2026


img

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు దేని వాదనలు దానివే అన్నట్లు సాగుతున్నాయి. 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మూడు బ్యారేజీల పునాదులు, గోడలు చాలా బలహీనంగా ఉన్నాయని ఎన్‌డీఎస్ఏ నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది.

వాటిలో నీటిని నిల్వ చేస్తే అవి కొట్టుకుపోయి వాటి దిగువనున్న 44 గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉందని ఎన్‌డీఎస్ఏ నిపుణుల బృందం నివేదికలో హెచ్చరించింది. 

మరోవైపు బీఆర్ఎస్‌ పార్టీ నేతలు వాటిలో నీటిని నిల్వ చేయకుండా ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ రైతులకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు. 

ఈ రెండు వాదనలు గమనించినట్లయితే నిపుణుల నివేదిక ప్రకారం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమైతే, రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ప్రభుత్వం అలా చేయకూడదు. 

అదే విధంగా బ్యారేజీలు బలంగానే ఉన్నాయని నీటిని నిలువ చేసినా ప్రమాదం లేదని బీఆర్ఎస్ వాదిస్తోంది కనుక దానికి అది బలమైన సాంకేతిక ఆధారాలు చూపాల్సి ఉంటుంది. 

ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం చెపుతున్నట్లు బ్యారేజీలు కొట్టుకుపోయి గ్రామాలు నీట మునిగితే దానికి బీఆర్ఎస్‌ పార్టీయే పూర్తి బాధ్యత వహిస్తుందని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. .

కాళేశ్వరం ప్రాజెక్టు సాధారణ నిర్మాణం కాదు. లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటి అవసరాలు, తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడిన ప్రాజెక్టు. 

అలాంటి ప్రాజెక్టుపై రాజకీయ ఆరోపణలు చేయడం సులభమే. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా 44 గ్రామాలకు నిజంగా ప్రమాదం ఉంటే, ముందుగా ప్రజల ప్రాణాలే ముఖ్యం.

 బీఆర్ఎస్ చెప్తున్నట్లుగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని నిల్వ చేయకుండా ఉంటే, దానిపై కూడా శాస్త్రీయంగా, పారదర్శకంగా సమాధానం చెప్పాల్సిందే.

ఏది ఏమైనప్పటికీ, తెలంగాణని సస్యశ్యామలం చేయాల్సిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇటువంటి రాజకీయాలకు వేదికగా మారడం చాలా బాధాకరమే. 



Related Post