ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి విసిరిన సవాలుతో మళ్ళీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయాలు వేడెక్కాయి. దమ్ముంటే తెలంగాణ అభివృద్ధి, అవినీతిపై చర్చకు రావాలంటూ సిఎం సవాలుని స్వీకరిస్తున్నానని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడంతో ఈ డ్రామా మొదలైంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ మంత్రుల కోసం తెలంగాణ భవన్‌లో కూర్చొని ఎదురు చూస్తుంటే, ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు గన్‌పార్క్ వద్దకు వెళ్ళగా పోలీసులు ఆయనని అడ్డుకోవడంతో అక్కడో హైడ్రామా మొదలైంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు చేరుకుని అక్కడ బీఆర్ఎస్ నేతలతో మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమని ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ నేతలు రాకపోవడంతో తమను ఎదుర్కొనే ధైర్యం లేక మొహం చాటేశారని వారు ఆరోపించారు.
ఒకవేళ వారికి దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి, తమ వాదనలు నిజమనే నమ్మకం ఉంటే ఓ తేదీ, సమయం, వేదిక నిర్ణయించుకొని మీడియా ముందే చర్చకు కూర్చోవచ్చు కదా? కానీ ముగ్గురూ మూడు చోట్ల కూర్చొని ప్రత్యర్ధులు తమతో చర్చకు రాలేదని ఎద్దేవా చేస్తుండటం చూస్తున్న ప్రజలు ‘ఇదో రాజకీయ డ్రామా’ అని అనుకోకుండా ఉంటారా?