అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ జూలై 10న విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ‘లెనిన్’ని రామ్ చరణ్ సూపర్ హిట్ ‘రంగస్థలం’తో పోల్చడం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “నా ఆల్ టైమ్ ఫేవరేట్ రంగస్థలమే. దానిలో హీరోకి చెవుడు. వినపడదు. వరుసపెట్టి తప్పులు చేస్తూనే ఉంటాడు. అతని వలన సమస్యలు పుట్టుకొస్తుంటాయి... ఆ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను.
ఒక సినిమాలో హీరో క్యారెక్టర్ ఇలా కూడా ఉంటుందా?దానిని ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారా?అని ఆశ్చర్యపోయాను. సినిమాలో హీరో అంటే కొన్ని కొలతలు ఉంటాయి. కానీ అవేమీ లేకుండా హీరోని ప్రెజంట్ చేసిన విధానం చూసి ఆశ్చర్యపోయాను.
దర్శకుడు సుకుమార్ ఓ కథ వ్రాసుకున్నారు. దానిని యధాతధంగా తీసేశారు అంతే. అప్పటి నుంచే నాకు రంగస్థలం ‘ఆల్ టైమ్ ఫేవరేట్’గా మారిపోయింది.
ఆ ప్రభావం నాపై కూడా పడింది. ఫలితం ఎలా ఉన్నా పర్వాలేదనుకొని లెనిన్ కూడా అలాగే కథని నమ్ముకొని తీశాము. బహుశః అందుకే ‘లెనిన్’ని ఆ సినిమాతో పోల్చుతున్నట్లున్నారు. కానీ రంగస్థలం, లెనిన్ రెండు పూర్తి భిన్నమైన సినిమాలు,” అని అఖిల్ అన్నారు.