యాదగిరిగుట్ట ఆలయ పాలకమండలి నియామకాలపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే చర్చ మొదలైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాలకమండలి ఏర్పాటు విషయంలో నల్గొండ జిల్లాకు చెందిన తన వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులను సంప్రదించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. విదేశీ పర్యటనలో ఉన్న దేవాదాయ ధర్మదాయ శాఖా మంత్రి కొండా సురేఖకైనా సమాచారం ఇచ్చారా లేదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలను పక్కన పెట్టి ఇతర పార్టీలకు దగ్గరగా ఉన్న వారికి అవకాశాలు కల్పించడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, నియామకాలలో మాత్రం కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యం దక్కడం లేదనే సందేశం ఇచ్చినట్లయిందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.