రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి ప్రకాశ్ కుమార్తె బ్లెస్సీ పర్యావరణ పరిరక్షణలో తనదైన ముద్ర వేస్తోంది. ప్రస్తుతం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఆమె చిన్న వయసులోనే పచ్చదనం కోసం కృషి చేస్తోంది.
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మూడేళ్ల వయసు నుంచే ప్రకృతితో మమేకమైన బ్లెస్సీ, విత్తనాల సేకరణ, సీడ్ బాల్స్ తయారీలో నైపుణ్యం సాధించింది. ప్రకృతి సంరక్షణను తన జీవిత లక్ష్యంగా మార్చుకుంది.
పర్యావరణ కార్యకర్త వనజీవి రామయ్య స్ఫూర్తితో బ్లెస్సీ తన తండ్రి ప్రకాశ్‌తో కలిసి మూడో తరగతి నుంచి విత్తన బంతులను చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల విత్తన బంతులను చల్లినట్లు సమాచారం.
ఈ ఏడాది మరో 15 వేల విత్తన బంతులను తయారు చేసి 12 వేల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.
చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణ కోసం బ్లెస్సీ చేస్తున్న కృషి పలువురి ప్రశంసలను అందుకుంటోంది. ఇటువంటి చిన్నారులకు ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లభిస్తే మరింత మంది విద్యార్థులు ప్రకృతి సంరక్షణ కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.