18 మందితో యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు

July 01, 2026


img

తెలంగాణవాసుల ఇలవేలుపు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు. కేసీఆర్‌ హయంలో యాదగిరి గుట్టని యాదాద్రిగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాదాద్రి దేవస్థానానికి తిరుమల తరహాలో 18 మందితో పాలక మండలిని ఏర్పాటు చేసింది. 

బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, దేవస్థాన ఆస్తుల పరిరక్షణ, పరిపాలనా వ్యవహారాల పర్యవేక్షణ వంటి బాధ్యతలను ఈ బోర్డు నిర్వహించనుంది.

మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ఈ పాలక మండలికి ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించారు. 

రెండేళ్ల పదవీకాలంతో పనిచేసే ఈ యాదాద్రి బోర్డులో వారసత్వ ధర్మకర్తగా లక్ష్మీనారాయణ నాయక్‌కు స్థానం కల్పించారు. కార్మిక శాఖ మంత్రి జీవీ వివేక్ వెంకటస్వామి, సినీ నటుడు చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెలతో పాటు చిలప్పగిరి విజయరాజం, తుల్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, కంటమాని స్వాతి, ఎం. రాఘవేంద్రరావు సభ్యులుగా నియమించింది. 

అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (దేవాదాయ శాఖ) ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి, ప్రధాన అర్చకులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగనున్నారు.



Related Post