అనిల్ రావిపూడి-వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని చెప్పి మరీ గత ఏడాది సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టారు. ఈసారి కూడా మళ్ళీ పండగకి వస్తున్నామని చెప్పి ఇటీవలే కొబ్బరికాయ కొట్టేశారు. ఈసారి వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరితో మొదలుపెట్టారు. ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కి జోడీగా క్రుతిశెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగూ వచ్చే సంక్రాంతికి రావడం ఖాయం అయ్యింది కనుక ఈ సినిమాకి ‘జనవరి 13’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి స్పీడు మామూలుగా ఉండదు కనుక నేడో రేపో ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ లేదా ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేయడం ఖాయమే అని భావించవచ్చు. సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.