సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై కొనసాగిన సస్పెన్స్ ముగించారు. తమిళనాడు సిఎం విజయ్ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించి, పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని తిరుచ్చి ఈస్ట్ సీటును వదులుకున్నారు.
ఆయన వదులుకున్న తిరుచ్చి ఈస్ట్ నుంచి రాఘవ ఉపఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. కానీ ఏమయిందో ఏమో హటాత్తుగా యూటర్న్ తీసుకొని తాను పోటీ చేయడం లేదని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
“రాజకీయాల్లోకి రాగానే నేరుగా ఎమ్మెల్యే సీటు కోసం పోటీ చేయడం రాజకీయ ధర్మం కాదు. ఆ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళుగా పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కనుక వారికే అక్కడ నుంచి పోటీ చేసే అర్హత ఉంటుంది. కనుక వారికే టికెట్ దక్కాలని నేను అనుకుంటున్నాను.
ఒకవేళ నేను టీవీకే పార్టీలో చేరితే కింది స్థాయి నుండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ఉపఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన నేను రాజకీయాలకు దూరం కావడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లోకి అడుగు పెడతాను.
నా సామాజిక సేవలకు రాజకీయ ప్రవేశానికి ఎటువంటి సంబంధమూ లేదు. అవి యధాతధంగా కొనసాగుతూనే ఉంటాయి,” అని రాఘవ లారెన్స్ చెప్పారు.