తెలంగాణలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను నెలరోజుల పాటు అంటే జూలై 24 వరకు నిర్వహించనుంది. ఓటరు జాబితాల్లో ఉన్న తప్పులను సరిదిద్దడం, కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
దీని కోసం ఎన్నికల సంఘం సుమారు 50,000 మంది బూత్ స్థాయి సిబ్బంది (బీఎల్‌వో)లను నియమించి వారికి ఈ ప్రక్రియ గురించి అవసరమైన శిక్షణ ఇచ్చింది. ఒక్కో బీఎల్‌వో రోజుకి 50 ఇళ్ళకు వెళ్ళి ఓటర్లను గుర్తించి వారి చేత ఎనుమరేషన్ ఫారాలు నింపించాల్సి ఉంటుంది. ఓటర్లు తమ పేరు, చిరునామా, వయస్సు వంటి వివరాలను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైతే సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రంలో సుమారు మూడు కోట్లకు పైగా ఓటర్ల వివరాలను ఈ ప్రక్రియలో పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని లక్షల ఓటరు నమోదుల్లో వ్యత్యాసాలు గుర్తించిన నేపథ్యంలో వాటిని ప్రత్యేకంగా పరిశీలించనున్నారు.
అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడటమే లక్ష్యమని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ప్రజలు బూత్ స్థాయి అధికారులకు సహకరించి తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణ ప్రక్రియకు ప్రాధాన్యత ఏర్పడింది.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి రాజకీయ నాయకుల సహకారంతో ఓటరు, ఆధార్, రేషన్ కార్డులు పొందినవారు వేల సంఖ్యలో ఉన్నారని బిజేపి పదేపదే ఆరోపిస్తుంటుంది.
అదేవిధంగా ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన పలువురుకి రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇంకా బోగస్ ఓటర్లు, చనిపోయినవారి పేరుతో ఓట్లు వేసేవారు కూడా ఉన్నారు. ఇటువంటివి గుర్తించి ఏరి పారేయడానికే కేంద్ర ఎన్నికల కమీషన్ దేశ వ్యాప్తంగా ఈ ‘సర్’ ప్రక్రియ నిర్వహిస్తోంది. కానీ బిజేపిని వ్యతిరేకించేవారి ఓట్లు, బిజేపి ప్రత్యర్ధి పార్టీల ఓట్లు తొలగించేందుకే సర్ నిర్వహిస్తోందంటూ, కాంగ్రెస్‌తో సహా బిజేపి ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తూనే ఉన్నాయి.