పవన్ వ్యాఖ్యలపై సిఎం రేవంత్‌ మౌనమేల?

June 05, 2026


img

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై అన్ని పార్టీల నేతలు భగ్గుమంటున్నారు, తెలంగాణవాదులు కూడా ప్రెస్‌మీట్‌లు పెట్టి కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ అంత దారుణంగా మాట్లాడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టనట్లు ఉండిపోయిందంటూ కొందరు సిఎం రేవంత్ రెడ్డిని కూడా నిందిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.  

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందిస్తూ, “తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్‌ అలాంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్‌ పార్టీలో ఒక్క పొన్నం ప్రభాకర్‌ మాత్రమే స్పందిస్తారా? వేరెవరూ మాట్లాడరా? పవన్ కళ్యాణ్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించినా రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోయారు? చంద్రబాబు నాయుడు కోసమేనా? అంటూ నిలదీశారు. 

పవన్ కళ్యాణ్‌ పార్టీ సమావేశం పెట్టుకుంటామంటే పోలీసులు ఎందుకు అనుమతివ్వలేదు. అందువల్లే కదా ఇంత రాద్దాంతం జరుగుతోంది? అసలు ఆయనని అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి? అని బిజేపి, బీఆర్ఎస్‌ రెండు పార్టీల నేతలు అప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇంకా చాల మంది చాలా రకాలుగా సిఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని లేదా పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తూనే ఉన్నారు. 

ఈ విమర్శలు, ప్రతివిమర్శల వలన ప్రజలలో కూడా ఆవేశం కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీకి సిఎం రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారాయి. కనుక సిఎం రేవంత్ రెడ్డి స్పందించి వీటికి తెర దించితే మంచిది. లేకుంటే ఈ వాదోపవాదాలు చిలికి చిలికి గాలివానలా మారితే తర్వాత పెద్ద సమస్యగా మారిపోయే ప్రమాదం ఉంది. 


Related Post