ఇటీవల తెలంగాణ ప్రభుత్వం- ఆర్టీసీ కార్మిక సంఘాల మద్య జరిగిన చర్చలలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ ముందుగా ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఉండాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆ గుర్తింపు సంఘం నేతలను కూడా ఈ విలీన ప్రక్రియ విధివిధానాలు రూపొందించే కమిటీలో భాగస్వామిగా ఉంటారని మంత్రి చెప్పారు.
ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అది పూర్తయిన తర్వాత గెలిచిన సంఘం ప్రతినిధులతో కూడిన ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రక్రియ ముగిసేందుకు సుమారు రెండు మూడు నెలలు పట్టవచ్చు. ఏటా సోనియా గాంధీ పుట్టిన రోజు (డిసెంబర్ 9)నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు లేదా ప్రకటన చేస్తుంటుంది. కనుక ఆలోగా విలీన ప్రక్రియ పూర్తిచేసి ఆ రోజున తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.