బండికి ఈటలకు సయోధ్య ఎంతకాలం?

July 18, 2026


img

‘మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ’ అని ప్రధాని మోదీ చెప్పిన మాట రాష్ట్ర బీజేపీ నేతల చెవికి ఎక్కిందో లేదో కానీ, బీజేపీ అధిష్ఠానం అప్పుడే కార్యాచరణ మొదలుపెట్టినట్లే కనిపిస్తోంది.

తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం ముఖ్య నేతల మధ్య సఖ్యత లేకపోవడమేనని గుర్తించింది.

ఆ జాబితాలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ పేర్లు కూడా ఉన్నాయి. కనుక వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ జాతీయ నాయకుడు అభయ్ పాటిల్‌ను హైదరాబాద్‌కు పంపింది.

ఆయన బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్ ఇంట్లో విందు సమావేశం నిర్వహించి ఇద్దరినీ పిలిపించారు.

ఈ సమావేశంలో ఆయన ఎదుటే ఇద్దరూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర స్థాయిలో అగ్రనేతల మధ్య సఖ్యత లేకపోతే త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి.

ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కనుక ఇద్దరూ పంతాలు, పట్టింపులు, విభేదాలు అన్నీ పక్కన పెట్టి పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని అభయ్ పాటిల్ వారికి నచ్చజెప్పి రాజీ కుదిర్చారు.

ఆ తర్వాత వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి షేక్‌హ్యాండ్ ఇచ్చుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తద్వారా తమ మధ్య విభేదాలు సమసిపోయాయని చెప్పినట్లే.

కానీ వారి మధ్య విభేదాలకు కారణమైన సమస్యలను పరిష్కరించకుండా షేక్‌హ్యాండ్ ఇప్పించేస్తే కలిసి పనిచేస్తారా? డౌటే! అవునో కాదో త్వరలో వారే చాటి చెబుతారుగా!


Related Post