భారతీయ రైల్వే చరిత్రలో ఇది మరో కీలక ఘట్టం. ప్రధాని నరేంద్ర మోదీ తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును శుక్రవారం హర్యానాలోని జింద్ నుంచి ప్రారంభించారు. దీంతో హైడ్రోజన్ రైళ్ళను నడుపుతున్న దేశాల సరసన భారత్ కూడా చేరింది.
‘నమో గ్రీన్ రైల్’ పేరుతో ప్రారంభమైన ఈ రైలులో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికత ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ రసాయన చర్యతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
ఈ ప్రక్రియలో నీటి ఆవిరి మాత్రమే బయటకు వెలువడుతుంది. కనుక ఇది మరింత పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థగా నిలుస్తుంది. జింద్‌లో ప్రత్యేకంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.
దీనిలో హైడ్రోజన్ శక్తితో నడిచే రెండు డ్రైవింగ్ కోచ్‌లు, ఎనిమిది ప్రయాణికుల బోగీలు ఉన్నాయి. దీనిలో ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణించవచ్చు.
ప్రస్తుతం ఇది హర్యానా రాష్ట్రంలోనే జింద్-సోనిపట్ మధ్య సుమారు 89 కిలోమీటర్లలో నడుస్తుంది.
ఈ హైడ్రోజన్ రైలు గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. కానీ ప్రారంభ దశలో భద్రతా కారణాల దృష్ట్యా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడిపించనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశం స్వావలంబనతో పాటు సుస్థిర అభివృద్ధి దిశగా మరో చారిత్రాత్మక అడుగు వేసిందన్నారు.
పరిశుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ భారత రైల్వేలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.