ఎన్టీఆర్ అభిమానుల పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘రా ఎన్టీఆర్’ సంస్థపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దీని వెనుక ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడు ఉన్నాడా? అని చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థతో జూ. ఎన్టీఆర్‌కి ఎలాంటి సంబంధం లేదని ఆయన కార్యాలయం ఓ లేఖ విడుదల చేసింది.
దానిపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు సాయిరామ్ నేడు తిరుపతిలోని ప్రెస్‌మీట్ పెట్టి తమ సంస్థ ఆవిర్భావం, చేస్తున్న, చేయబోతున్న పనుల గురించి వివరించి తమపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు.
ఎన్టీఆర్ పేరును వాడుకుని ఎన్నడూ మేము రాజకీయాలు చేయలేదు. అలాగే ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేయబోము. ఆయన అభిమానులు చేసే సేవా కార్యక్రమాలన్నిటినీ ఒక వేదికపైకి తీసుకురావడమే మా ఉద్దేశ్యం. ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి ఆర్థిక, వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు పొందడం లేదు. అలాంటి ఆలోచన కూడా మాకు లేదు.
అభిమానుల సేవ అంటే కేవలం అన్నదానం, రక్తదానం మాత్రమే కాదని, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే ఎన్టీఆర్ మాటే మాకు స్ఫూర్తినిచ్చి ఈ సంస్థ ఏర్పాటు చేసేలా చేసింది. ఒకవేళ మా ఈ కార్యక్రమాలు ఎన్టీఆర్‌కు ఇబ్బంది కలిగిస్తున్నాయని ఆయన స్వయంగా చెబితే మేము ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్నింటినీ నిలిపివేస్తాము,” అని సాయిరామ్ అన్నారు.
అయితే ఎన్టీఆర్ కార్యాలయం నుంచి లేఖ వెలువడిన తర్వాత కూడా ఈ సంస్థను కొనసాగిస్తూ, ఆయన స్వయంగా చెప్తేనే మానేస్తామని సాయిరామ్ చెప్పడంపై మళ్లీ విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పట్ల అంత అభిమానం, గౌరవం ఉండి ఉంటే ముందుగా ఆయనని కలిసి అనుమతి తీసుకొని ఈ సంస్థతో సేవా కార్యక్రమాలు చేపడితే అందరూ హర్షించేవారు కదా? కానీ ఆయన కార్యాలయం నుంచి లేఖ వెలువడిన ప్రెస్‌మీట్ పెట్టి ఈవిధంగా మాట్లాడటం, భవిష్య కార్యాచరణ కూడా ప్రకటించడం సబబు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
రా ఎన్టీఆర్ సంస్థ తరపున సాయిరామ్ చెప్పాల్సింది చెప్పేశారు. కనుక ఇప్పుడు బంతి ఎన్టీఆర్ కోర్టులోనే ఉన్నట్లు లెక్క. కనుక రా ఎన్టీఆర్ సంస్థ నిర్వహించిన ఈ ప్రెస్‌మీట్, దాని భవిష్య కార్యాచరణపై ఎన్టీఆర్ ఏవిధంగా స్పందిస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది.
నేను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి.
— BIG TV Cinema (@BigtvCinema) July 18, 2026
ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ కార్యక్రమాన్ని (ఊరు వాడ) ముందుకు తీసుకెళ్తాం.
- సాయి రూప్ (RAW NTR) ఆర్గనైజర్ #UoruWada #SaiRoop #RAWNTR #Tollywood #BreakingNews #NTR #BIGTVCinema @tarak9999 pic.twitter.com/rvHS7U0d2S