బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో నేడు సరూర్ నగర్‌లో నిర్వహించిన యువ సంగ్రామ సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను, ప్రభుత్వం పని తీరుని గట్టిగా నిలదీశారు.
రెండున్నరేళ్ళు గడిచినా ఇంతవరకు స్కూటీలు, తులం బంగారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తమ హయంలో నోటిఫికేషన్స్ జారీ చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియని కొలిక్కి తెస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తమవిగా చెప్పుకుంటోందని కేటీఆర్ ఆక్షేపించారు.
రెండున్నరేళ్ళలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెపుతున్నారు కనుక వాటి కోసం జారీ చేసిన నోటిఫికేషన్లు చూపించాలని, చూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలు విసిరారు.
నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ‘యూత్ డిక్లరేషన్’ అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతని మోసం చేస్తూనే ఉంది. కనుక యువత కాంగ్రెస్ నేతలకు ‘డెత్ డిక్లరేషన్’ ఇవ్వాలని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లైమాక్స్‌కి చేరుకుంది. అది హిట్లర్ కంటే దారుణంగా ఉండబోతోందన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గద్దె దించి, మళ్ళీ కేసీఆర్‌ని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఖాయమన్నారు.
ఇదివరకు తమ ప్రభుత్వ హయంలో ఉద్యోగాల భర్తీ విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. ఈసారి అవి పునరావృతం కాకుండా నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.