భారత్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. ఈసారి అంతరిక్ష రంగంలో హైదరాబాద్ సత్తా చాటింది హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్‌టెక్ సంస్థ. స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ శనివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు.
ఇప్పటి వరకు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపే ఆర్బిటల్ రాకెట్లను ప్రభుత్వ సంస్థ ఇస్రో మాత్రమే అభివృద్ధి చేసి ప్రయోగించేది.ఇస్రో సహకారంతో నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతంగా కక్ష్యను చేరుకోవడంతో భారత అంతరిక్ష రంగంలో ఇప్పుడు ఇస్రోతో ప్రైవేట్ రంగం కూడా పోటీ పడగలదని నిరూపితమైంది. కనుక ఖచ్చితంగా ఇదొక కొత్త అధ్యాయమే.
‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపట్టిన ఈ తొలి ప్రయోగంలో విక్రమ్-1 భూమికి సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులోని ఎర్త్ ఆర్బిట్‌లో పలు పేలోడ్లను విజయవంతంగా పరీక్షించింది.
దీనిలో మూడు ఘన ఇంధన దశలు, చివర్లో 3డీ ప్రింటెడ్ ద్రవ ఇంజిన్‌తో పనిచేసే ఆర్బిటల్ అడ్జస్ట్‌మెంట్ మాడ్యూల్ కూడా ఉంది. అది కూడా చక్కగా పనిచేయడంతో ఈ ప్రయోగంలో ఇది కూడా ఓ నూతన ఆవిష్కరణగా నిలుస్తోంది.
ఈ ప్రయోగంలో మొత్తం ఆరు పేలోడ్లు ప్రయాణించాయి. వీటిలో భారతీయ, విదేశీ సంస్థలకు చెందిన సాంకేతిక ప్రదర్శన పరికరాలు, సూక్ష్మ ఉపగ్రహాలు ఉన్నాయి.
అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వహస్తాలతో రాసిన ‘వందే మాతరం’ సందేశంతో కూడిన ఓ పోస్టుకార్డు కూడా ఈ మిషన్‌లో అంతరిక్షానికి చేరింది.
విక్రమ్-1 రాకెట్‌ను భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయి గౌరవార్థం ఆ పేరుతో రూపొందించారు.
చిన్న ఉపగ్రహాలను వేగంగా, తక్కువ ఖర్చుతో కక్ష్యలోకి ప్రవేశపెట్టే విధంగా దీన్ని రూపొందించారు.
ఈ రాకెట్ ద్వారా భూకక్ష్యలో సుమారు 350 కిలోల వరకు పేలోడ్‌ను, సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో 260 కిలోల వరకు ఉపగ్రహాలను పంపే సామర్థ్యం ఉంది.
2018లో మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా స్థాపించిన స్కైరూట్ ఏరోస్పేస్ ఇప్పటికే 2022లో విక్రమ్-ఎస్ సబ్ ఆర్బిటల్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి దేశంలో తొలి ప్రైవేట్ స్పేస్ లాంచ్ కంపెనీగా గుర్తింపు పొందింది. ఇప్పుడు విక్రమ్-1 విజయంతో సంస్థ ప్రపంచ వాణిజ్య అంతరిక్ష మార్కెట్‌లో మరింత బలంగా అడుగుపెట్టింది.
ప్రయోగ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్కైరూట్ బృందాన్ని అభినందించారు. భారత యువత ప్రతిభ, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఈ విజయాన్ని భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు.
భారత ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరిచిన తర్వాత స్టార్టప్‌లకు ఇది అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ విజయంలో హైదరాబాద్ భాగస్వామిగా నిలవడం మన అందరికీ గర్వకారణం.
(video courtesy: NDTV Profit)