హైడ్రా నోటీస్ అందుకున్న ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సోమాజిగూడలో ఆ సంస్థ నిర్మిస్తున్న 17 అంతస్తుల భవన సముదాయాలు హుస్సేన్ సాగర్ ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్నందున వాటి నిర్మాణ అనుమతులు ఎందుకు రద్దు చేయరాదో వివరణ ఇవ్వాలని కోరుతూ ఇటీవల హైడ్రా ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీనిపై ఆ సంస్థ హైకోర్టుని ఆశ్రయించగా, నేడు విచారణ జరిపి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసు విచారణ ముగిసే వరకు యధాతధ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చేపడుతున్న ప్రాజెక్ట్ జోలికి వెళ్ళవద్దని ఆదేశించింది.
ఇటీవల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సంస్థ యాజమాన్యం, మాజీ మంత్రిగా చేసిన తన సోదరుడు కేటీఆర్ కుమ్మక్కయ్యి భారీగా అవినీతి, అక్రమాలకూ పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అక్రమ నిర్మాణమన్నట్లు హైడ్రా నోటీస్ జారీ చేయడంతో ఆమె వాదనలలో ఎంతో కొంత నిజముందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఇంతవరకు ఆమె ఆరోపణలపై స్పందించలేదు.