అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై 15 కత్తి పోట్లు!

July 16, 2026
img

అమెరికాలోని ఉటాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడిపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. హైదరాబాద్‌, టోలీ చౌక్‌కు చెందిన సయ్యద్ సోహైలుద్దీన్ (37) వ్యాలీఫెయిర్ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నప్పుడు పీటర్ మైఖేల్ లార్సెన్ అనే వ్యక్తి వచ్చి మంచి నీళ్ళ బాటిల్ అడిగాడు. 

అతను సోహైల్  పేరు అడిగి తెలుసుకున్నాక తన వెంట తెచ్చుకున్న కత్తితో హటాత్తుగా దాడి చేశాడు. షాపింగ్ మాల్‌లో అందరూ చూస్తుండగానే అతను 15 సార్లు కత్తితో పొడిచాడు. వెంటనే సిబ్బంది అతనిని పట్టుకొని బందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు పీటర్‌ని అరెస్ట్ చేసి సోహైల్‌ని ఆస్పత్రికి తరలించారు. పలుచోట్ల కత్తిపోట్లు కారణంగా తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. 

కానీ అతనికి వైద్య భీమా లేనందున వైద్య చికిత్సకు మొత్తం మూడు లక్షల డాలర్లు అవసరం. తోటి ఉద్యోగులు, అమెరికాలో భారతీయులు ఉదారంగా విరాళాలు ఇవ్వడంతో సుమారు 2.41 లక్షల డాలర్లు సమకూరింది.         

సోహైల్ తన భార్య అమీన్, ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నారు. మత విద్వేషంతోనే పీటర్ సోహైల్‌పై దాడి చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉన్న అతని తల్లితండ్రులు తక్షణం అమెరికా బయలుదేరేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Related Post